పాటల ప్రహసనం

మా క్యాథ్ లాబ్ లో ఆపరేషన్ చేసేటప్పుదు పేషంట్ కి డాక్టర్ కి ఇద్దరికి కొద్దిగా రిలాక్స్డ్ గా ఉంటుందని మంద్ర స్థాయిలో పాటలు పెట్టటం పరిపాటి. కొన్ని రోజుల క్రితం రెండు సార్లు ఇదే విషయం పై ఒక హింది మరియు ఆంగ్ల వార్తా చానల్స్ కి నేను ఇంటర్వూ కూడా ఇచ్చా! ఆ సమయంలో అసలు మంద్ర స్థాయిలో సంగీతం ఎలా మనసును ఆపరేషన్ సమయంలో ప్రశాంతంగా ఉంచుతుందో అని చెప్పా. అంతే కాదు ఆ చానల్ దాన్ని మ్యూజిక్ థెరపి గా దానికి కొద్దిగా మసాలా వేసి చెప్పింది కూడా!
గత వారం ప్రొద్దునే ఒక రోజు సాధారణంగా చేసినట్టే ఎనిమిది గంటలకు అలానే యాంజియోప్లాస్టి ఆపరేషన్ మొదలుపెట్టా. ఒక సీనియర్ నర్స్ నాతో పాటు వాష్ అయ్యి నాకు శస్త్ర చికిత్సలో సహాయం చేస్తుంది. వాళ్ళని స్క్రబ్ నర్స్ అంటాము.ఇంకొక నర్స్ కొద్దిగా జూనియర్, సాధారణంగా ఏమన్నా కావలసి వస్తే అందిస్తుంటారు. వారికి సర్క్యులేటింగ్ నర్స్ అని పేరు. ఆ రోజు అప్పుడే జాయిన్ అయిన మేల్ నర్స్ సర్క్యులేటింగ్ నర్స్ గా ఉన్నాడు. సరే ఎదో ఎఫ్ ఎం చానల్ పెట్టి సర్జరి ఉపక్రమించా.

ఆ పేషంట్ కొద్దిగా ఆందోళన చెందుతున్నాడు ఈ గుండె ఆపరేషన్ సక్సస్ అవుతుందో కాదో అని. డాక్టర్ అయిన నాకు అది ఆ రోజులో చేసే చాలా కేసులలో ఒకటి. కాని అతనికి? జీవితంలోనే మొదటి సారి హాస్పిటలో అడుగుపెట్టటం. అందులోను గుండె ఆపరేషన్ ఆయే! సాధారణం కంటే కొద్ది ఎక్కువ మోతాదులో ధైర్యం చెప్పవలసి వచ్చింది. అందులోను నేను చేసే యాంజియోప్లాస్టి ఆపరేషన్ కి కేవలం ఆ ప్రదేశంలో మాత్రమే మత్తు మందు ఇస్తాము. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో రోగితో సంభాషణలు చేస్తూనే వైద్యం చేస్తాము. ప్రోసీజర్ అవ్వగానే లేచి నడిచి వెళ్ళిపోతారు.

ఏవో కొన్ని అర్ధం పర్ధం లేని మాటలు ఆ ఎఫ్ ఎం చానల్ ఆర్ జే అన్న తర్వాత ఒక పాట మొదలు అయ్యింది.ఆ పాట “తేరి జాన్ లేగా” అని మొదలు అయ్యింది. నాకు చిన్నగా నవ్వు వచ్చింది! శస్త్ర చికిత్స చేస్తు పొయ్యా. పాటలు ఎలా పరిణామం చెందాయి అని అనుకున్నా మనసులో. గుండె ఆపరేషన్ చేస్తూ ఇలాంటి పాట ఏమిటి అని అనుకుంటూ పేషంట్ ఎలా ఫీల్ అవుతున్నారో అనుకున్నా. సరే తూర్పు గోదావరి వాస్తవ్యుడు ఆయనకు హింది రాదులే అనుకుని సర్జరి చేస్తున్నా. కాస్సేపు అయిన తర్వాత అర్ధం అయ్యింది అది తెలుగు పాట అని. అంతే కాదు దాని థీం ఒక ఈగ ప్రతీకారం అని. కాస్సేపటికి ఆ పాట కొత్త పుంతలు తొక్కింది. “ఒకటి నిన్ను చంపటం, రెండు నిన్ను చంపటం, మూడు నిన్ను చంపటం …” అలా సాగుతోంది. నాకు వెంటనే పాట ఆపమని నా సర్క్య్హులేటింగ్ నర్స్ (కొత్త అబ్బయి) కి చెప్పా, వాడికా ఆ రేడియో స్విచ్ ఎక్కడో తెలియదు. నేను చిరాగ్గా “ పవర్ ఆపు” అన్నా పేషంట్ కంగారు పడతారు అని. వాడు వెంటనే థియేటర్లో లైట్లు ఆపేసాడు. చీకట్లో పాట కంటిన్యూ అయ్యింది “నాలుగు నిన్ను చంపటం, ఐదు నిన్ను చంపటం”. ఈ సారి పేషంట్ ఆందోళన పడతారు అని నాకు రూఢి అయ్యింది. ఏమి చేస్తాము! చీకట్లో కరక్ట్ స్విచ్ దొరకాలి. మొత్తానికి తిప్పలు పడి లైట్ ఆన్ చేసి రేడియో ఆపగలిగాము.

బుద్ధి వచ్చింది పాటలు పెడితే ఏవో సిడిలు పెట్టాలి కాని ఇలా మన పాటల కంట్రోల్ ఎఫ్ ఎం చానల్స్ చేతుల్లో పెట్టగూడదు అని!

Posted in General | Comments Off

హృదయపూర్వకంగా నవ్వండి – గుండె జబ్బు దూరం చేసుకోండి

 

This is a draft of my article published in sakshi recently

మానవాళి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం
హృదయపూర్వకంగా నవ్వగలగటం – మార్క్ ట్వైన్

సాధారణంగా
ఒక వ్యక్తికి కోపం ఉంటే అతనికి
బిపి ఉందనో లేక హార్ట్
పేషంట్ అయ్యే అవకాశం ఉందనో
అనుకోవటం పరిపాటి. నా దగ్గరికి వచ్చే
ఆలుమగలు తరచూ రెండవ వ్యక్తికి
ఎక్కువగా కోపం ప్రదర్శిస్తున్నాడు అని ఫిర్యాదు
చేయటం పరిపాటి. “ఏవండి, హార్ట్ పేషంట్ అలా కోపం తెచ్చుకోకూడదు
అని చెప్పండి” అంటారు. నేను మాత్రం “ఆ
కోపంకి కారణం ఎవరో వాళ్ళు
కూడా సంయమనంతో ఉండాలి” అంటూ ఉంటాను.అసలు
ఒక వ్యక్తి తరచు కోపం వస్తున్నా,
మనసులోనే బాధ పడుతూ, ఎక్కువగా
అవేశ పడుతుంటే వాళ్ళకి గుండె జబ్బు లేక
రక్త పోటు వచ్చే అవకాశం
ఉన్నయని మనందరికి తెలుసు. కాని మనస్పూర్తిగా నవ్వుతూ
ఉంటే గుండె జబ్బులు రావు
అని ఈ మధ్య ప్రచురితమైన
పరిశోధనల లో వెల్లడి అయ్యింది.

ప్రతి
సంవత్సరం మే నెల మొదటి
ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం గా జరుపుకుంటారు. ఈ
సందర్భంగా ఈ వ్యాసంలో నవ్వు
కి గుండె జబ్బుకి ఉండే
సంబంధం గురించి తెలుసుకుందాం.  నవ్వగలగటం
సమస్త జీవ రాశులలో మానవునికే
సాధ్యం. ఇంతవరకు ప్రపంచంలో నవ్వకుండా ఉన్న మనిషిని ఎవ్వరు
చూడలేదు. నవ్వు అనే ప్రక్రియలో
శరీరంలో చాలా అవయవాలు,మనసు
పాల్గొంటాయి. కాని అన్ని నవ్వులు
మంచివి కావండి! అసలు నవ్వులలో ఎన్ని
రకాలు? ఎలాంటి నవ్వు నవ్వితే గుండె
జబ్బు రాదో తెలుసుకుందాం.కొంత
మంది నవ్వితే అవతల వాళ్ళకి పుండు
మీద కారం జల్లినట్టు ఉంటుంది.చిరు దర మందహాసం,
ముసి ముసి నవ్వు, చిరు
నవ్వు, వెటకారపు నవ్వు, వెకిలి నవ్వు, వికటాట్టహాసపు నవ్వు అలా నవ్వులలో
చాలా రకాలు. ఇవన్ని గుండెకి మంచివి కావండోయ్! కేవలం హృదయపూర్వకంగా ఆనందంతో
వచ్చే నవ్వు మాత్రమే గుండె
జబ్బులని దూరం చేస్తుంది.ఇలా
హృదయపూర్వకంగా వచ్చే నవ్వులో మాత్రమే
శరీరంలో ఊపిరితిత్తులు, ముఖ కండరాలు, ఇతర
భాగాలో ఉన్న కండరాలు పాల్గుంటాయి.
ఉల్లాసంగా వచ్చే నవ్వులో ఈ
వివిధ అవయవాల మేళవింపు ఇంకా ప్రస్ఫుటంగా ఉంటుంది.

నవ్వులలో
పద్దెనిమిది రకాలు ఉన్నాయిట. ఆనందంతో
కూడిన నవ్వు ఎంతో మంచిది.
నవ్వు రక్తంలో కార్టిసాల్ అనే హార్మోన్ తగ్గిస్తుంది.
దీని వల్ల మధుమేహం, గుండె
పోటు వంటి వ్యాధులు సోకే
అవకాశం తక్కువ. కేవలం పదిహేను నిముషాలు
నవ్వితే రెండు గంటలు నిద్ర
పోయినంత ఫలితం ఉంటుంది. 1950 దశకంలో
సగటున ప్రతి మనిషి 18-20 నిముషాలు
నవ్వుతుంటే ఈ రోజున అది
కేవలం 4-6 నిముషాలకు తగ్గిపోయింది. ఒక సారి కేవలం
పదిహైను క్షణాలు  నవ్వితే
మనిషి జీవన పరిమాణం రెండు
రోజులు పెరుగుతుందిట!హాస్య స్పూర్తి ఉండే
వారు మిగతా వారికంటే ఎనిమిది
సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. చిన్న పిల్లలు రోజులో
400 సార్లు నవ్వుతారు. కాని దురదృష్టవశాత్తు, పెద్దవాళ్ళు
రోజుకు 4-6 సార్లు నవ్వటం కూడా గగనం అవుతోంది.

 

మనందరికీ
తెలుసు గుండె జబ్బు రాకుండా
ఉండాలి అంటే మంచి ఆహారపుటలవాట్లు,
వ్యాయామం తప్పనిసరి. కాని గుండెల నిండా
నవ్వితే గుండె జబ్బులు దూరం
అవుతాయి అని ఈ మధ్యే
తెలిసింది. ఈ పరిశోధనలో కొంత
మందికి హాస్య సన్నివేశాలు ఉన్న
సినిమా చూపించారు, మరి కొందరికి చాలా
సీరియస్ సినిమా చూపించారు. ఎవరైతే పదిహైను నిముషాలు హాస్య చిత్రాన్ని చూసారో
వాళ్ళలో శరీరంలోని వివిధ అవయవాలకు రక్త
ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది అని తెలిసింది. అంతే
కాదు రక్త నాళాల సంకోచ
వ్యాకోచ శక్తి కూడా మెరుగు
పడుతుంది.

 

ఓవర్
టైం చేసే ఉద్యోగులకు మానసిక
ఒత్తిడి ఎక్కువ. ఇలా పని చేసే
వారికి నవ్వ కలిగే శక్తి
కోల్పోయి గుండె జబ్బులు సోకే
అవకాశం ఎక్కువ అని క్రితం సంవత్సరం
ఐరోప ఖండ హృద్రోగ నిపుణుల
సదస్సులో ఫిన్లాండ్ నుంచి ప్రొఫెసర్ లాలుక
బృందం సమర్పించిన పరిశోధనలో చూపించారు.

 

ఈ పరిశోధనల ఆధారంగా ఇప్పుడు కేవలం ఆహారం, వ్యాయాయం  మాత్రమే
కాదు కనీసం  రోజులో
ఒక పదిహైను నిముషాలు నవ్వుల పూవుల వీడియోలు చూడటం
మంచిది అని డాక్టర్ల ఉవాచ. నవ్వుతో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల చేయబడతాయి. ఇలా విడుదల అయిన
హార్మోన్లు రక్త నాళాలు ఆరోగ్యంగా
ఉండటానికి ఉపయోగ పడతాయి.అంతే
కాదు హార్ట్ అటాక్ వచ్చిన రోగులకు
తరుచూ అకారణంగా కోపం వస్తుందని, ఒక
వేళ  నవ్వు
వచ్చే పరిస్థుతుల్లో కూడా నవ్వగలిగే శక్తి
కోల్పోతారు అని పరిశోధనలలో తేలింది.
అందుకనే వైద్యులు ఆహారం, వ్యాయామం తో పాటు హాస్యాన్ని
కూడా అనుభవించాలి  అని
నిర్దేశిస్తున్నారు.

నవ్వుతో
రక్త నాళాలు పెద్దవి కాబడతాయి. దీని వల్ల శరీరంలోని
వివిధ అవయావాలతో పాటు గుండె కూడా
రక్త ప్రసరణ సుళువుగా అవుతుంది. నవ్వుతున్న వాళ్ళ రక్త నాళాలు
50 శాతం పెద్దవిగా ఉంటాయి. ఇంత మంచి పరిణామం
వ్యాయామం లేక ఆహారంలో పధ్యంతో
సమానం రక్త నాళాల ఆరోగ్యం
పెంపొందిస్తుంది.

 

Posted in Public Health Education | Comments Off

Protected: బుట్టలో పీతలమా మనం? Crabs in a basket

This post is password protected. To view it please enter your password below:


Posted in General | Enter your password to view comments.

సలహా తీసుకోవటం బలహీనుల లక్షణమా?

ఒక విషయం గురించి మనకు కొద్దిపాటి సందేహం ఉన్నా ఎవరో ఒకరి సలహా తీసుకోవాలి అని దృఢంగా నమ్ముతాను. నేను ఫ్రాన్స్ నుంచి వచ్చిన కొత్తలో నా సహచరుల సలహాలు తీసుకొనేవాడిని. నేను అప్పటికే యంజియోప్లాస్టి వైద్య ప్రక్రియలో ఒక పూర్తి సంవత్సరకాలం తర్ఫీదు పొంది షుమారుగా ఆరు వందల యాంజియోప్లాస్టిలు కూడా చేసాను సంవత్సరంలో.    ఐనా నేను అనుకునే వాడిని ఒక మెదడు కంటే రెండు మెదళ్ళు ఐతే మంచి నిర్ణయం తీసుకోగలుగుతాము అని. ఐతే చాలా సార్లు నా సహచరులు వేరే వాళ్ళ దగ్గర “ఆ! రఘు కి కష్టమైన కేసు వస్తే నేనే చేసి పెట్టా” అనే వారు. మనసు చివుక్కుమనేది. మా హాస్పిటల్ యజమాని నన్ను పిలిచి “బాబూ నువ్వు ఇలా కేసుల కోసం ఇతరుల సలహా తీసుకుంటే నువ్వు బద్నాం అవుతున్నావు” అని చెప్పి “ఇలా చెయ్యటం మానివెయ్యి భాయ్ సాబ్” అన్నారు. అదే సమయంలో నాతో పాటు అసోసియేట్ గా డాక్టర్ ఆనంద్ చేరటం జరిగింది. క్రమేణా ఆ యువ డాక్టర్ లక్నో లో తర్ఫీదు పొంది, చాలా శక్తి ఉండటం, కార్య దీక్షా నిబద్ధత కలిగి ఉండటం వల్ల అతనితో కలసి చర్చించి తర్వాతే చాలా కేసులు చేసాను. దాని వల్ల అతను చాలా త్వరగా యంజియోప్లాస్టి నేర్చుకోగలిగాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే అలానే నేను కూడా బెనిఫిట్ అయ్యాను. చాలా కాంప్లెక్స్ కేసులు చేయటానికి అతని తోడ్పాటు మరియు వైద్య ప్రక్రియ తర్వాతి పర్యవేక్షణలో అతని సహాయ సహకారాలు నా పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. అలా ఒక జూనియర్ సలహా తీసుకోవటం నాకు ఉపయోగపడింది.

కొన్ని నెలల క్రితం నేను ఒక మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తిని సంప్రదించాను. నేను నా వృత్తి సంబంధిత గతి మార్చటానికి ఏమైనా సలహా ఇమ్మని కోరాను. అతను అన్నాడు “సార్ స్కూల్స్ లో ప్రోగ్రాంలు పెట్టండి మంచి ఆలోచనలు, సలహాలు వస్తాయి” అన్నాడు. మీ పేరు అందరికి తెలియటమే కాదు, పిల్లలకి ఆరోగ్య అవగాహన కల్పించటమే కాదు, మీకు కూడా అధ్భుతమైన ఆలోచనలు వస్తాయి అన్నాడు. అది నేను ఆచరణ లోకి తేలేక పోయాను కాని అతని భావం, సలహా అర్ధం చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిల్లల నుంచి నేను నేర్చుకొవల్సింది ఏమైనా ఉందా? అని మనసు వారి మీద నిలపటం ప్రారంభించాను.

ఇప్పుడు అసలు కధలోకి వస్తే వైద్య వృత్తిలో ఉండే వారు, సాధారణంగా కాలేజ్ లో వారి జూనియర్స్ని జీవితాంతం వారి జూనియర్స్ లానే పరిగణిస్తారు.చాలా సార్లు ఒక పార్టీ లోనో కాన్‌ఫరెన్స్ లోనో అతని జూనియర్స్ కలిసినప్పుడు ఆ జూనియర్ చాలా ఉచ్చ స్థితిలో ఉన్నా అతన్ని పరోక్షంలో కాని ప్రత్యక్షంలో కాని “వాడా వాడు నా జూనియర్ అండి” అంటారు. ఒక వేళ అతన్ని ఇంకెవరికైనా పరిచయం చేయవలసి వస్తే “ఇతను నా జూనియర్, నా స్టూడెంట్ కూడా” అని పరిచయం చేస్తారు. ఒక్క సారి అతనికి  నా జూనియర్ అని బిరుదు తగిలించేటప్పటికి అతన్ని సలహా అడగలేము. అదే అతను మనతో పని  కలసి  చేస్తున్నాడు అనుకో అతని పూర్తి శక్తి సామర్ధ్యాలను మనం ఉపయోగించుకోలేము.

వైద్య వృత్తిలో అహం కు చాలా పెద్ద పీట ఉంది ఎందు కంటే చిన్నపటి నుంచి ప్రతి స్థాయిలోను వాళ్ళే అన్నిటిలోను టాప్ గా ఉండటం,  తీవ్ర ఒత్తిడిలో చదవటం – మంచి ఉత్తీర్ణత సాధించటం , అందరి కంటే మంచి పర్ఫార్మన్స్ ఉండాలనే దుగ్ధ్ధ ఏర్పడిపొవటం -  అది సాధించటం, కుటుంబంలో వాళ్ళని అందలం ఎక్కించటం, చదువుకుని  వృత్తిలోకి వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చే ప్రతి రోగి నమస్కారం చేయటం (డాక్టర్లు చాలా తక్కువ మంది ప్రతి నమస్కారం చేస్తారు) అన్నీ కలసి ఒక అహంభావం మూర్తిభవించిన ఒక వ్యక్తి తయారు అవుతారు. (అందరు డాక్టర్లు అలాగే ఉంటారు అని అనను కాని). అంతే కాదు చిన్నపట్టి నుంచి ఒక గదిలో దూరి చదువుకుంటూ ఉండిపోవటం వల్ల సంఘంలో చాలా మందికి మెసలటం తెలీదు. ఎంత సేపు వాళ్ళ సర్కిల్స్ లో తిరుగుతారు, ఎవరో ఒకరి పొగడ్తలు విని ఆనందిస్తూ వుంటారు. (నేను కూడా దీనికి మినహాయింపు కాదు అండోయి).  దీని వల్ల ఒకరి సలహా తీసుకోవటం చిన్నతనం అవుతుంది, సీనియర్స్ అడగాలి అంటే  బెరుకు, తోటి వాడిని అడగాలి అంటే ప్రచారం చేస్తాడేమో అని నామోషీ, జూనియర్ అడగాలి అంటే అహంభావం అన్ని వెరసి  వాళ్ళకి వాళ్ళే కరక్ట్ అనుకొని  వైద్యం చేస్తారు. అసలు ఒక సంక్లిష్ట రోగి ని డీల్ చేసేటప్పుదు ఇతరుల సలహా ఎంత ఉపయోగమో గ్రహించరు.

వైద్య శాస్త్రం లో సాధారణ రోగాలకు షుమారుగా 95 శాతం సక్సెస్ ఉంటుంది. దానితో వైద్యులకు తాము చేసేదే సరియైన పద్ధతి అని నమ్మకం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత పక్కన వారి సలహా తీసుకొనే అవకాశం కూడా ఉంది అని మర్చేపోతారు. అందుకే ఒక వేళ రోగి జబ్బు గురించి రెండు ప్రశ్నలు వేసినా, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళితే ఎలా ఉంటుంది అని అడిగినా, ఇంకొక డాక్టర్ చేత ఫోన్ చేయించినా తారా స్థాయిలో చికాకు పడిపోతారు. ఇలాంటివి మారాలి అంటే వైద్యులు కూడా తమది కూడా ఇతరులు లాగా ఒక వృత్తి అని అర్ధం చేసికొన్నపుడు, అహం లేకుండా ప్రవర్తించినప్పుడు, ఇతరులు సలహా తీసుకోవటం బలహీనత కాదు బలవంతుల లక్షణం అని గ్రహించినప్పుడు.

అసలు ఒక వేరే వ్యక్తి శరీరం మీద డాక్టర్కి ఏమి హక్కు ఉంది? ఇది మీకు వచ్చిన జబ్బు, ఇది మీకు అందవలసిన వైద్యం, వైద్య ప్రక్రియ యొక్క మంచి చెడులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి తర్వాత మన అభిప్రాయం వ్యక్తీకరించటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇంకొక వైద్యుని సలహా కోరుతున్న రోగులను ప్రోత్సాహించటం కూడా మంచిది.

సలహా తీసుకోవటం బలవంతుల లక్షణం కాని బలహీనత ఎంత మాత్రం కాదు.

 

 

Posted in General | 4 Comments

వైద్యుని వెతలు

 

పాకిస్తాన్ లో డాక్టర్ షికాల్ అఫ్రిది ని కొద్ది రోజుల క్రితం జైల్ లో పెట్టారు. కారణం వింటే చాలా తమాషాగా ఉంటుంది. అతను బిన్ లాడెన్ పట్టుకోవటం కోసం అమెరికా ప్రభుత్వానికి సహకరించాడు అని ఆరోపణ. ఇంతకు ముందు ఎవరి దృక్పథం వారిది (April 2011 – ఎవరి దృక్పధం వారిది) అని ఒక బ్లాగ్ రాసాను అదే విధంగా ఈ కథ కూడా నడుస్తుంది.

బిన్ లాడెన్ అబొట్టాబాద్ లో దాక్కున్నాడు అని అమెరికా అనుమనించింది. కాని పాకిస్తాన్ ని అడిగితే బిన్ లాడెన్ అక్కడి నుంచి మకాం మార్చటం ఖాయం. అక్కడున్నది లాడెన్ కాక పోతే ఒక స్వతంత్ర దేశం లోకి అకారణంగా ప్రవేశించారు అనే అపవాదు వస్తుంది. బిన్ లాడెన్ అని ధ్రువీకరించిన తర్వాతే దాడి చేయాలి అని నిర్ణయించారు. కాని నిర్ధారణ ఎలా?

మన సినిమాల లో లాగా మారు వేషంలో వెళ్ళాలి అని నిర్ణయించారు. షికాల్ అఫ్రిది అనే డాక్టర్ ని దీని కోసం నియమించారు. బిన్ లాడెన్ ఇంటికి హెపటైటిస్ టీకా ఇవ్వటానికి అన్నట్టు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ DNA నమూనాలు సేకరించి అమెరికాకు అందచేస్తాడు. సేకరించిన నమూనాలు ధృవపరుచుకున్న తర్వాత అమెరికా పకడ్బంది ప్రణాళికతో దాడి చేసి లాడెన్ ని హతమార్చగలిగింది.

హతమార్చిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన దర్యాప్తులో ఈ డాక్టర్ పాత్ర బయట పడింది. అంతే అతన్ని  తీసుకుని వెళ్ళి ముందు జైల్ లో వేసారు, అదీ దేశ ద్రోహం నేరం కింద.అమెరికా ఇది చాలా తప్పు అని అరిచి గీ పెడుతోంది. టెర్రరిజం మీద పోరులో ఇతను చాలా సహాయం చేసాడు అని. కాని పాకిస్తాన్ మాత్రం వేరే దేశం తన దేశ అంతర్భాగంలో చొరబడటానికి సహకరించాడు అని  వాదిస్తోంది.  అసలు కధ అమెరికా ని ఏమి చేయలేము, కనీసం ఈ డాక్టర్ మీద అయినా యాక్షన్ తీసుకొన్నాం అని  అనందిస్తున్నారు. 

అదే మెడిసిన్ సాన్ ఫ్రాంటియర్స్ (కొద్ది సంవత్సారల క్రితం నోబుల్ పురస్కారం పొందిన సంస్థ) లాంటి స్వచ్చంద సంస్థ అంటుంది అమెరికా ఇలాంటి పనులు చేయటం వల్ల క్షేత్ర స్థాయిలో పనిచేసే వాళ్ళ డాక్టర్లకు ముప్పు అని. అమెరికా అంటోంది టెర్రరిజం వ్యతిరేకంగా సహాయం చేసిన వ్యక్తిని జైల్ లో పెట్టటం చాలా తప్పు.పాకిస్తాన్ వర్షన్ ఏమిటంటే దేశ ద్రోహం చేసిన వ్యక్తి జైల్ లో కాక ఎక్కడ ఉండాలి అని. మన కధానాయకుడు షికాల్ అఫ్రిది మాత్రం అమెరికా దేశం కోసం సహాయం చెసిన దానికి ప్రతిఫలంగా అమెరికా వెళ్ళి స్థిరపడాల్సిన నేను(అన్ని ఎర్పాట్లు పూర్తి అయ్యాయండోయి!)ఇలా జైల్ ఊచలు లెక్కపెట్టల్సి వస్తుందనుకోలేదు అని వాపోతున్నాడు.

ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న అసలు ఇలాంటి పనులకు డాక్టర్లను, వైద్య సంబంధిత వ్యక్తులను అమెరికా ఉపయోగించటం సమంజసమా? మీ అభిప్రాయల కోసం ఎదురు చూస్తూ… రఘు

Posted in General | 1 Comment